ఏపీకి ఎఫ్సీఐ నుంచి రావాల్సిన రూ.4 వేల కోట్లు విడుదల చేయమని కోరాం: మంత్రి కొడాలి నాని

  • కేంద్ర ఆహార శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ని కలిసిన కొడాలి
  • ఎఫ్సీఐ గిడ్డంగుల్లో ధాన్యం నిల్వలు ఖాళీ చేయాలని కోరాం
  • ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు
ఎఫ్సీఐ నుంచి ఏపీకి రావాల్సిన రూ.4 వేల కోట్లను విడుదల చేయాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ని కోరినట్టు ఏపీ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఢిల్లీలో పాశ్వాన్ ని ఈరోజు ఆయన కలిశారు. అనంతరం మీడియాతో కొడాలి నాని మాట్లాడుతూ, రైతుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని నిల్వ చేసేందుకు గోడౌన్స్ అవసరముందని, అందుకని, ఎఫ్సీఐ గిడ్డంగుల్లో ధాన్యం నిల్వలు ఖాళీ చేయాలని, ఏపీలో మొత్తం కోటి 30 లక్షల కార్డులు ఉంటే అందులో 92 లక్షల కార్డులను మాత్రమే కేంద్రం గుర్తించిందని, మిగిలిన వాటిని కూడా గుర్తించాలని  కోరినట్టు చెప్పారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు.

రేషన్ కార్డుల జారీకి గతంలో మార్గదర్శకాలను సడలించడం ద్వారా ఎక్కువ మందికి కార్డులు అందేలా నిబంధనలు సరళీకృతం చేశామని, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్ మెంట్ కార్డులు ప్రత్యేకంగా ఇస్తున్నామని, దీని వల్ల తొమ్మిది లక్షల మంది తమకు రేషన్ అవసరం లేదని తమ కార్డులను స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చారని చెప్పారు. ఆరు లక్షల కార్డులను పరిశీలిస్తున్నామని, అనంతరం అర్హులకు కార్డులు ఇస్తామని వివరించారు. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని, ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండాలన్న లక్ష్యంతోనే నిబంధనలు సడలించామనని అన్నారు.


More Telugu News