రామ జన్మభూమిలో సమాధులేమీ లేవు.. ముస్లింలకు స్పష్టం చేసిన అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్​

  • అక్కడ చుట్టూ ముస్లింల సమాధులు ఉన్నాయన్న లాయర్ షంషాద్
  •  అక్కడ ఎలాంటి శ్మశానం, సమాధులు లేవన్న మేజిస్ట్రేట్
  • సుప్రీంకోర్టు అన్ని అంశాలు పరిశీలించాకే భూమిని అప్పగించిందని వ్యాఖ్య
అయోధ్య కేసులో ముస్లింల తరఫు లాయరైన షంషాద్ చెబుతున్నట్టుగా రామ జన్మభూమి స్థలంలో ఎలాంటి సమాధులూ లేవని అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) అనూజ్ ఝా స్పష్టం చేశారు. ముస్లింల సమాధులున్న చోట రామాలయం ఎలా కడతారంటూ ‘రామ జన్మభూమి క్షేత్ర ట్రస్టు’కు శంషాద్ లేఖ రాసిన నేపథ్యంలో అనూజ్ ఝా వెంటనే వివరణ ఇచ్చారు.

ఇప్పటికే కోర్టుకు చెప్పాం

రామాలయం నిర్మాణం చేపట్టనున్న 67 ఎకరాల స్థలంలో ఎక్కడా ఎలాంటి సమాధులు లేవని అనూజ్ ఝా చెప్పారు. ‘‘ఇప్పుడు లాయర్ షంషాద్ చేస్తున్న వాదన సహా అన్ని అంశాలను సుప్రీంకోర్టు తన విచారణ సమయంలో పరిశీలించింది. అప్పుడే కోర్టుకు అన్ని వివరాలు అందజేశాం. ఆయా అంశాల్లో నిజానిజాలేమిటన్నది స్పష్టంగా పేర్కొంటూ తీర్పు కూడా ఇచ్చింది. రామ జన్మభూమి ప్రాంతంలో ఎలాంటి శ్మశానం, సమాధులు లేవు. కోర్టు అన్నీ పరిశీలించాకే.. ఈ స్థలాన్నికేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. కోర్టు ఆదేశాల ప్రకారం మేం నడుచుకుంటున్నాం..” అని వివరించారు.

రేపు రామ జన్మభూమి ట్రస్టు సమావేశం

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు’ మొదటి సమావేశం ఈ నెల 19వ తేదీన జరుగనుంది. ట్రస్టు బోర్డు సభ్యుడు, సుప్రీంకోర్టు లాయర్ కె.పరాశరన్ నివాసంలో జరిగే ఈ భేటీలో ఆలయ నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.


More Telugu News