మా సమాధులపై రామాలయం నిర్మిస్తారా?: ట్రస్టుకు లేఖరాసిన ముస్లింలు
- ఇది సనాతన ధర్మాన్ని ఉల్లంఘించడం కాదా?
- 1885 అయోధ్య అల్లర్ల మృతులను అక్కడే ఖననం చేశారని వెల్లడి
- ఆలయ నిర్మాణానికి ఆ స్థలాన్ని వినియోగించవద్దని కోరుతున్నామన్న ముస్లింలు
అయోధ్యలో కూల్చిన మసీదు చుట్టూ ముస్లింల సమాధులు ఉన్నాయని, ఆ ప్రాంతంలో రామాలయ నిర్మాణం ఏం సనాతన ధర్మమంటూ అయోధ్యకు చెందిన కొందరు ముస్లింలు రామాలయ నిర్మాణ ట్రస్టుకు లేఖ రాశారు. అయోధ్యలో వివాదాస్పద భూమి రామ్ లల్లాకే చెందుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడ ఆలయం నిర్మించుకోవచ్చని, కాకపోతే స్వతంత్ర ట్రస్టు ఏర్పాటుచేసి దాని ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. దీంతో భారత ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సమయంలోనే 'శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర' పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ లేఖతో మళ్లీ చర్చకు తెరలేచింది. అయోధ్య కేసులో ముస్లింల తరపున వాదిస్తున్న న్యాయవాది ఎం.ఆర్.షంషద్ ఆలయ ట్రస్టుకు సారధ్యం వహిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కె.పరాశరన్ కు ఈ లేఖ పంపారు. 1885లో అయోధ్యలో జరిగిన అల్లర్లలో 75 మంది ముస్లింలు చనిపోయారు. వారి శవాలన్నీ మసీదు చుట్టూనే ఖననం చేశారు.
1994లో ఇస్లామీ ఫరూఖీ తీర్పులో వివాదాస్పద కట్టడం చుట్టూ సమాధులు ఉన్నాయని ప్రస్తావించారు. ధ్వంసం చేసిన మసీదు చుట్టూ ఉన్న నాలుగైదు ఎకరాల్లో ముస్లింల సమాధులున్నాయి. ఆ ప్రాంతాన్ని ఆలయ నిర్మాణానికి వినియోగించవద్దని మేం విజ్ఞప్తి చేస్తున్నాం' అంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
67 ఎకరాల స్థలంలో ముస్లింల గురించి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. వారి సమాధులపై రామాలయం నిర్మించడం ఆమోద యోగ్యమో, కాదో ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని షంషద్ కోరారు.