చైనా నుంచి వచ్చిన తెలుగు వారికి మోక్షం.. ఈ రోజు సాయంత్రానికి స్వస్థలాలకు!
- వూహాన్ నుంచి వచ్చిన వారిలో 23 మంది తెలుగు వారు
- ఐసోలేషన్ పరీక్షలు పూర్తి కావడంతో విడుదల
- కోవిడ్-19 లేదని సర్టిఫికెట్ అందజేసి పంపుతున్న వైనం
కోవిడ్-19 బారిన చిక్కుకుని విలవిల్లాడుతున్న చైనాలోని వూహాన్ నగరం నుంచి వచ్చిన భారతీయుల ఐసోలేషన్ టెస్టులు పూర్తి కావడంతో వారి విడుదల మొదలయ్యింది. దాదాపు పది హేనుల రోజులపాటు వీరిని ప్రత్యేక గదుల్లో ఉంచి పలు రకాల టెస్టులు చేశారు. ప్రస్తుతం వీరికి కోవిడ్-19 లేదని తెలిపే సర్టిఫికెట్లు అందజేసి వారి స్వస్థలాలకు పంపుతున్నారు.
చైనాలోని వూహాన్ నగరంలో చిక్కుకున్న భారతీయులను రెండు ఎయిరిండియా ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తెచ్చిన విషయం తెలిసిందే. తొలిసారి 324 మంది, తర్వాత 323 మంది.. మొత్తం 647 మంది భారత్ చేరుకోగా, వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 23 మంది ఉన్నారు. వీరందరినీ అప్పటి నుంచి ఢిల్లీలోని ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ఉంచి అవసరమైన పరీక్షలు నిర్వహించారు.
దాదాపు పది హేను రోజులపాటు పరిశీలన తర్వాత కేంద్ర ఆరోగ్య సంస్థ వీరికి 'కోవిడ్-19' లేదని సర్టిఫికెట్ ఇచ్చి పంపుతోంది. ఈ రోజు సాయంత్రానికి తెలుగు రాష్ట్రాల వారు వారి స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉంది.