పరీక్ష తప్పడంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

  • ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణం
  • ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని నోట్లోకి ఆక్సిజన్ పీల్చి మృతి 
  • బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

బీటెక్ రెండో సంవత్సరం పరీక్ష తప్పానన్న మనస్తాపంతో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడి ఆ కుటుంబానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముఖానికి ప్లాస్టిక్ కవర్ తొడుక్కుని నోట్లోకి ఆక్సిజన్ వదులుకుని చనిపోయాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఫిల్మ్ నగర్ పరిధి వినాయకనగర్ లో నివసించే కురుమయ్య, రమణమ్మ దంపతుల కొడుకు గణేష్ (19) ఓ పైవేటు కళాశాలలో బీటెక్ రెండో ఏడాది చదువుతున్నాడు.

రెండు నెలల క్రితం ఫలితాలు రాగా, అతను ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి, మనస్తాపానికి గురైన గణేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి వాసన వస్తుండడం గమనించిన స్థానికులు తొంగిచూడగా గణేష్ మెడకు సిలిండర్ కట్టుకుని కనిపించాడు.

దీంతో వారు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి, అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, చనిపోయే ముందు గణేష్ నెట్ లో ఆత్మహత్యకు సంబంధించిన పలు సైట్లు చూసినట్లు పోలీసులు గుర్తించారు.



More Telugu News