దొంగలెత్తుకెళ్లిన అమ్మవారి హుండీని చూపించిన వీధి కుక్క... గుంటూరు జిల్లాలో ఘటన!

  • నిదానంపాటి అమ్మవారి ఆలయంలో చోరీ
  • హుండీని ఖాళీ చేసి, చెరువులో పడేసిన దొంగలు
  • వారు వెళ్లిన మార్గాన్ని చూపించిన శునకం
అమ్మవారి ఆలయం తాళాలను పగులగొట్టి, హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, దాన్ని ఖాళీ చేసి, ఆపై చెరువులో పడేసి వెళ్లగా, వాళ్లను గమనించిన ఓ శునకం, హుండీ ఎక్కడుందో నిత్యమూ గుడికి వచ్చే ఓ వృద్ధురాలికి చూపింది. ఈ ఘటన గుంటూరు జిల్లా, రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో ఉన్న నిదానంపాటి అమ్మవారి ఆలయంలో జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలో దొంగలు పడి, అక్కడ ఏర్పాటు చేసివున్న హుండీని ఎత్తుకెళ్లారు. హుండీని పగులగొట్టి, ఆపై దాన్ని తీసుకెళ్లి దగ్గరలో ఉన్న పెద్ద చెరువులో పడేశారు.

నిత్యమూ గుడి వద్దే ఉంటూ భక్తులు పెట్టే ఆహారాన్ని తిని బతుకుతున్న ఓ వీధి కుక్క వీరిని గమనించింది. గుడికి వచ్చే ఓ వృద్ధురాలిని అప్రమత్తం చేసింది. దాని సైగలను చూసి, అదేదో చెప్పాలని భావిస్తోందని అనుకున్న ఆమె, దాని వెంట నడిచేసరికి, చెరువు వద్దకు తీసుకెళ్లింది. చెరువులో హుండీ కనిపించగా, దొంగతనం జరిగిందని ఆమె ఊరి పెద్దలకు చెప్పింది.

ఇక ఈ హుండీలో 50 వేల వరకూ నగదు, వెండి కానుకలు ఉండవచ్చని ఆలయ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఈ శునకం చెరువు నుంచి డొంకరోడ్డు వైపు వెళుతూ మొరగడంతో దొంగలు అటువైపు వెళ్లి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.


More Telugu News