1,770కి చేరిన కరోనా మృతులు.. పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకున్న జపాన్ చక్రవర్తి
చైనాలోని హుబే ప్రావిన్స్ లో ఎక్కువగా కేసులు
జపాన్ షిప్ లో మరో 99 మందికి వైరస్
ఇతర దేశాల్లోనూ పెరుగుతున్న బాధితులు
చైనాలో కరోనా మృతుల సంఖ్య 1,770కి చేరింది. వైరస్ బారిన పడిన వారిలో శనివారం ఒక్కరోజే 105 మంది మృతిచెందారని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. ఇందులో వంద మంది కేవలం హుబే ప్రావిన్స్ కు చెందినవారు ఉన్నట్టు తెలిపింది. ఈ హుబే ప్రావిన్స్ లోని వూహాన్ నగరంలోనే కరోనా వైరస్ తొలిసారిగా ప్రబలింది.
70,548కి చేరిన బాధితులు
చైనాలో కొత్తగా 2,048 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. దీంతో ఆ దేశంలో మొత్తంగా కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 70,548కి చేరింది. ముఖ్యంగా హుబే ప్రావిన్స్ లోనే చాలా వరకు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ రోజూ స్వల్ప సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
జపాన్ షిప్ లో మరో 99 మందికి వైరస్
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జపాన్ సముద్ర జలాల్లో తీరానికి దూరంగా నిలిపిన ‘డైమండ్ ప్రిన్సెస్’ క్రూయిజ్ షిప్ లో మరో 99 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో షిప్ లో వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 454 కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత ఎక్కువగా కరోనా బాధితులు ఉన్నది ఈ క్రూయిజ్ షిప్ లోనే కావడం గమనార్హం.
పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకున్న చక్రవర్తి
జపాన్ లో 65 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా గుర్తించారు. దానికితోడు జపాన్ తీరంలో ఉన్న షిప్ లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో జపాన్ చక్రవర్తి నరుహితో 23వ తేదీన జరగాల్సిన తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. దేశంలో ఎక్కడా కూడా వేడుకలు నిర్వహించవద్దని, వైరస్ సంక్రమిస్తున్నందున పెద్ద సంఖ్యలో జనం ఒక్క చోటికి చేరడం మంచిది కాదని జపాన్ అధికారులు ప్రకటించారు.