చెల్లితో ఎలాంటి విభేదాలూ లేవు... ఏ విచారణకైనా సిద్ధం: పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

  • వారు తరచూ విహార యాత్రలకు వెళుతుంటారు
  • ఇప్పుడూ అలాగే వెళ్లారని భావించామన్న మనోహర్
  • విచారణకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసిన సీపీ కమలాసన్
తన సోదరి రాధ కుటుంబంతో తనకు ఎటువంటి విభేదాలూ లేవని పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు వారాల క్రితం రాధ, ఆమె భర్త సత్యనారాయణ, కుమార్తెలు ప్రయాణిస్తున్న కారు, కెనాల్ లో పడిపోయి, ఈ ఉదయం బయటపడగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ మృతి వెనుక మనోహర్ రెడ్డి ప్రమేయం ఉందని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తుండగా, ఈ ఉదయం ఆయన స్పందించారు. కేసును ఏ విచారణ సంస్థతో అయినా విచారించుకోవచ్చని, నిజానిజాలు విచారణ తరువాతే తేలుతాయని అన్నారు. తన సోదరి అంటే తనకు ప్రాణమని తెలిపారు. తమ కుటుంబంతో వారికి ఎటువంటి గొడవలూ లేవని, తరచూ కలుస్తుంటానని వెల్లడించారు.

రాధ కుటుంబం తరచూ విహార యాత్రలకు వెళుతూ ఉంటారని, ఇప్పుడూ అలాగే వెళ్లారని, ఆపై ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో పోలీసులకు కూడా సమాచారాన్ని అందించామని మనోహర్ రెడ్డి తెలిపారు.

ఇదిలావుండగా, ఘటనా స్థలికి చేరుకున్న కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి, వివరాలు అడిగి తెలుసుకుని, విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ ట్రయినీ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో పనిచేస్తుందని, పూర్తి వివరాలను సాధ్యమైనంత త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.


More Telugu News