రాహుల్ తీరుతో మన్మోహన్ సింగ్ కూ కోపం వచ్చిందట: ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
- ఓ దశలో ప్రధాని పదవికి రాజీనామాకు సిద్ధమయ్యారు
- ఓ ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ తీరుతో మన్మోహన్ మనస్తాపం
- తన తాజా పుస్తకంలో నాటి సంఘటనలు పునస్మరణ
మిస్టర్ కూల్ మన్మోహన్ సింగ్ కు ఓసారి కోపం వచ్చిందట. దాంతో ప్రధాని పదవికి రాజీనామా కూడా చేయాలనుకున్నారట. నచ్చజెప్పడంతో ఆయన శాంతించారట. ఈ మాట ఆశ్చర్యం కలిగిస్తోందా? నిజమే మరి. క్రికెట్ లో మిస్టర్ కూల్ గా దోనీని చెప్పుకుంటే, రాజకీయాల్లో ఆ ఘనత మన్మోహన్ సింగ్ దే. కాంగ్రెస్ వంటి సుదీర్ఘ చరిత్ర, గాంధీ కుటుంబం అదుపాజ్ఞల్లో నడిచే పార్టీ తరఫున రెండుసార్లు ప్రధానిగా పనిచేయడం, అది కూడా ఎటువంటి వివాదాల్లేకుండా నెట్టుకు రావడం సాధారణ విషయం కాదు. ఇందుకు ఆయనలోని శాంతిమూర్తి కారణం అంటారు పరిశీలకులు.
అటువంటి మన్మోహన్ సింగ్ కూడా అలిగారట. యూపీఏ-2 హయాంలో అప్పటి ప్రభుత్వం తెచ్చిన ఓ అత్యవసర జీఓను రాహుల్ గాంధీ చించివేయడంతో ఆయన ఈ ఆలోచన చేశారట. యూపీయే పాలననాటి ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు ఇతివృత్తంగా అప్పటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా రాసిన 'బ్యాక్ స్టేజ్ - ది స్టోరీ బిహైండ్ ఇండియాస్ హైగ్రోత్ ఇయర్స్'లో నాటి విషయాలను ప్రస్తావించారు.
'రాహుల్ చర్య అప్పట్లో సంచలనమైంది. తొలుత ఆర్డినెన్సును అంగీకరించిన నేతలు కూడా రాహుల్ దాన్ని చించివేయగానే మాట మార్చారు. దీంతో మన్మోహన్ కు తీవ్ర అవమానం ఎదురైనట్టయింది. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ చించేయడం అంటే ప్రధాని కార్యాలయాన్ని అవమానించడమే అని అప్పట్లో చాలామంది భావించారు. ఆ సమయానికి నేను అమెరికాలో ఉన్నాను.
ఈ ఘటనను పురస్కరించుకుని విశ్రాంత ఐఏఎస్ అధికారి సంజీవ్ ఓ వ్యాసం రాస్తూ మన్మోహన్ ను తీవ్రంగా విమర్శించారు. మన్మోహన్ ప్రతిష్ఠ మసకబారుతోందని అభిప్రాయపడ్డారు. నా మిత్రుల్లో చాలామంది కూడా సంజీవ్ తో ఏకీభవించారు. నేనా వ్యాసాన్ని మన్మోహన్ కు చూపిస్తే 'ఇప్పుడు నేను రాజీనామా చేయడం మంచిది అంటారా?' అని ఆయన అడిగారు.
కానీ నేను అన్ని విధాలా ఆలోచించాక వద్దని సలహా ఇచ్చాను' అని అహ్లూవాలియా తన పుస్తకంలో రాసుకొచ్చారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పథకాల రూపకల్పనలో అహ్లూవాలియా కీలక పాత్ర పోషించారన్న పేరుంది.