చోటా రాజన్ ఇంటికే కన్నమేసిన చోరుడు... ఎట్టకేలకు పట్టుబడ్డ బాంబే సలీం!

  • రెండు దశాబ్దాల చోర చరిత్ర
  • పలుమార్లు అరెస్ట్ అయినా మారని బుద్ధి
  • తాజాగా పుణెలో పట్టుబడిన సలీమ్
అతని చోర చరిత్ర రెండు దశాబ్దాల క్రితమే మొదలైంది. ఇప్పటివరకూ సుమారు 1000కి పైగా దొంగతనాలు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లలో ఇళ్లు ఉన్నాయి. విమానంలో వచ్చి, ఖరీదైన కార్లలో తిరిగి దొంగతనం చేసి వెళ్తాడు. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. హైదరాబాద్ పోలీసులు 2012లో అరెస్ట్ చేస్తే, బెయిల్ పై వచ్చి, పాత బుద్ధినే చూపించాడు. వీటన్నింటికీ మించి, 2001లో మాఫియా డాన్ చోటా రాజన్ ఇంట్లో రూ. 9 కోట్లు కొట్టేసి, ఆపై, పేపర్లలో తాను దొంగతనం చేసిన ఇల్లు చోటా రాజన్ దని తెలుసుకుని, అతన్ని క్షమించమని ప్రాధేయపడి, ప్రాణాలు కాపాడుకున్నాడు.

అతనే బాంబే సలీమ్. అలియాస్ మున్న ఖురేషీ, అలియాస్ మహ్మద్ హమీద్, అలియాస్ హుస్సేన్ ఖాన్. తన స్నేహితుడు ఇషావర్ తో కలిసి దొంగతనాలు చేస్తుంటాడు. ఇతనిపై ఇటీవలి కాలంలో 127 కేసులు నమోదు కావడంతో, నిఘా పెట్టిన పుణె పోలీసులు, ఎయిర్ పోర్టు సమీపంలో లాన్సర్ కారులో తిరుగుతున్న ఇతన్ని అరెస్ట్ చేశారు. పుణె పరిధిలో 30 పోలీసు స్టేషన్లు ఉండగా, 27 స్టేషన్లలో ఇతనిపై కేసులు ఉండటం గమనార్హం. ఇతన్ని పట్టుకునేందుకు పోలీసులు ఆరు నెలల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఇతనిపై హైదరాబాద్ లోనూ పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక బాంబే సలీమ్ అరెస్ట్ ను గురించి తెలుసుకున్న హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ విభాగం, పీటీ వారెంట్ తీసుకుని అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించింది.

2000 సంవత్సరంలో చిన్న ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. పగటి పూట రెక్కీ నిర్వహించి, రాత్రికి దొంగతనం చేయడం బాంబే సలీమ్ కి అలవాటు. ఆ మరుసటి సంవత్సరం ముంబైలోని చెంబూరు ప్రాంతంలో రెక్కీ చేసి, రాత్రి ఆ ఇంట్లో చొరబడి, చేతికందినదంతా దోచేశాడు. తదుపరి రోజు పత్రికల్లో తాను దొంగతనం చేసింది చోటా రాజన్ ఇంట్లోనని తెలిసి ప్రాణభయంతో వణికిపోయాడు. ఈ కేసులో ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, చోరీ సొత్తును రికవరీ చేశారు. రాజన్ అనుచరుల నుంచి చంపేస్తామని బెదిరింపులు రావడంతో, ఆయన్ను కలిసి, ముంబైని వదిలేస్తానని హామీ ఇచ్చి, పొరపాటు జరిగిందని వేడుకున్నాడు.

ఆపై బెంగళూరులోని పీన్యా సెకండ్ స్టేజ్ ప్రాంతంలోని అత్తారింటికి మకాం మార్చాడు. అక్కడా ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. వారి సాయంతో పుణెలో దొంగతనాలు చేసి, ఆ సొత్తును బెంగళూరులో విక్రయించాడు. దాదాపు 10 సంవత్సరాల తరువాత 2011లో పోలీసులు అరెస్ట్ చేశారు.

కొన్నాళ్లకు రెండో పెళ్లి చేసుకుని, ఒక భార్యను ముంబైలో, మరో భార్యను హైదరాబాద్ లో ఉంచి, అటూ ఇటూ తిరుగుతూ కాపురం చేశాడు. టోలీచౌకీ ప్రాంతంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను నిర్వహించి, నష్టాలు రావడంతో తిరిగి దొంగతనాల బాట పట్టాడు. 2012లో ఇతనిపై నిఘా ఉంచిన రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి, రూ. 56 లక్షలకు పైగా నగలు, ఒకటిన్నర కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముంబై, పుణె, హైదరాబాద్ లతో పాటు నాసిక్, నాగపూర్, థానేల్లో ఇతనిపై 127 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.


More Telugu News