మెట్రో వ్యవహారంలో విషయాలు తెలుసుకుని హుందాగా వ్యవహరిస్తే బాగుంటుంది: కిషన్ రెడ్డికి కర్నె ప్రభాకర్ హితవు

  • ఇటీవల జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభం
  • కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి నాంది
  • స్పందించిన ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభోత్సవం వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి, టీఆర్ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనిపై ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. మెట్రో వ్యవహారంలో కిషన్ రెడ్డి పూర్తిగా వివరాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఈ విషయంలో కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్న కిషన్ రెడ్డి హుందాగా ప్రవర్తించాలని అన్నారు.

మెట్రో ప్రారంభోత్సవంలో తాము ప్రోటోకాల్ ను పాటించామని, కానీ కిషన్ రెడ్డి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంలో అర్థంలేదని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏదైనా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తీసుకురావడంపై దృష్టిపెడితే బాగుటుందని, ఈ విషయంలో ఆయన సఫలమైతే సన్మానం చేసేందుకు కూడా తాము సిద్ధమని కర్నె స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు తమ సొంత రాష్ట్రాలకు నిధులు తీసుకు రావాలని తపించిపోతారని, కానీ కిషన్ రెడ్డిలో ఆ ఛాయలు కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.


More Telugu News