వైసీపీనీ, ‘సాక్షి’ ని వదలకపోతే గట్టిగా పట్టుకోండి.. ఏం అభ్యంతరం లేదు: యనమలకు అంబటి కౌంటర్

  • చంద్రబాబుపై ఆరోపణలు రావడం ఇవాళేమీ కొత్త కాదు
  • లక్షల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు చేశారు
  • అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి
చంద్రబాబుపై ఆరోపణలు రావడం ఇవాళేమీ కొత్త కాదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ, గుజరాత్ లలో తాను సాయం చేశానని చంద్రబాబు చెప్పుకున్నారని, ఏపీలో అవినీతికి పాల్పడి సంపాదించిన సొమ్మును ఆయా రాష్ట్రాలకు ట్రాన్స్ ఫర్ చేశారని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు చేశారని, అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయని, చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ పై ఐటీ దాడులు జరిగినప్పుడు అందుకు సంబంధించిన సమాచారం దొరికిందని అన్నారు. ఈ సమాచారం ఆధారంగా ఐటీ అధికారులు ముందుకు వెళ్తుండటంలో  తప్పేంటి? అని ప్రశ్నించారు.

వైసీపీనీ, ‘సాక్షి’ ని వదలమని టీడీపీ నేత యనమల అంటున్నారని, ‘వదలకపోతే గట్టిగా పట్టుకోండి. ఏం అభ్యంతరం లేదు’ అని అంబటి కౌంటర్ ఇచ్చారు. నేరారోపణలు చంద్రబాబు, లోకేశ్ లపై జరుగుతుంటే వాళ్లు మాట్లాడరే? ఈ నేరంతో తమకు సంబంధం లేదని చెప్పరే? వాళ్ల గొంతులో ఎందుకు వెలక్కాయ పడింది? మీరే ఎందుకు మాట్లాడుతున్నారు? అంటూ యనమలతో సహా టీడీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ దాడులతో తమకేమి సంబంధం అని చెప్పిన యనమల, ఇప్పుడేమో ఆయన ఇంట్లో అసలేమీ దొరకలేదంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ పీఎస్ తరఫున మీరు వకాల్తా పుచ్చుకుంటారా? లేదా? ఆయన నేరానికి పాల్పడ్డారా? లేదా? ఈ నేరంలో మీకు భాగముందా? లేదా? అంటూ అంబటి ప్రశ్నల వర్షం కురిపించారు.


More Telugu News