తల్లి అంత్యక్రియలకు వెళుతూ... భార్య సహా మాజీ పోలీసు అధికారి మృతి!
- ఆదిలాబాద్ లో మరణించిన రమణమ్మ అనే వృద్ధురాలు
- తలకొరివి పెట్టేందుకు బయలుదేరిన రిటైర్డ్ సీఐ విజయ్ కుమార్
- రోడ్డు ప్రమాదంలో భార్య సునీత సహా మృతి
ఎంతో బాధతో తల్లిని కడసారి చూసుకుని, తన బాధ్యతను నిర్వర్తించి రావాలని బయలుదేరిన కుమారుడు, అతని భార్య, ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట వద్ద జరిగింది. ఆదిలాబాద్ లో ఉంటున్న తన తల్లి రమణమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బయలుదేరిన రిటైర్డ్ సీఐ విజయ్ కుమార్, సునీత దంపతులు ప్రయాణిస్తున్న కారు, ఓ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మరణించగా, రమణమ్మ అంత్యక్రియలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం తరువాత ముగ్గురికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహిస్తామని రమణమ్మ కుటుంబ సభ్యులు వెల్లడించారు.