కేంద్రంలో వైసీపీ చేరడంపై జగన్ మాత్రమే ప్రకటన చేస్తారు: కొడాలి నాని

  • బీజేపీతో వైసీపీ పొత్తు అంటూ ప్రచారం
  • వైసీపీ నేతలకు కేంద్రమంత్రి పదవులంటూ ఊహాగానాలు
  • పిచ్చాపాటీగా చెప్పినదాన్ని పార్టీ వైఖరిగా భావించొద్దన్న కొడాలి నాని
  • జగన్ నిర్ణయమే ఫైనల్ అంటూ వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీయేతో కలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొనడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్డీయే సర్కారులో వైసీపీ చేరబోతోందని, వైసీపీ ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు దక్కనున్నాయని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. కేంద్రంలో వైసీపీ చేరే విషయంలో జగన్ మాత్రమే ప్రకటన చేస్తారని వెల్లడించారు. ప్రెస్ మీట్లలోనో, లేక పిచ్చాపాటీగానో చెబితే దాన్నే పార్టీ వైఖరిగా భావించరాదని అన్నారు. ఈ విషయంలో జగన్ చెప్పిందే వేదం అని స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదానే ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుందని, ఇతరత్రా అంశాలతో రాష్ట్రానికి ఉపయోగం లేదని జగన్, తాము కూడా చెప్పామని కొడాలి నాని వెల్లడించారు. ప్రస్తుతం తమకు రాజ్యసభలో ఇద్దరు సభ్యులు ఉన్నారని, మార్చిలో కానీ, ఏప్రిల్ లో కానీ నాలుగు రాజ్యసభ సీట్లు వస్తాయని, వచ్చే ఏడాది మరో నాలుగు సీట్లు వస్తాయని చెప్పారు. దాంతో రాబోయే రోజుల్లో బీజేపీకి రాజ్యసభలో బిల్లులు ఆమోదింపజేసుకోవాలంటే వైసీపీ అవసరం తప్పకుండా ఉంటుందని వివరించారు. ఆ అంశాన్ని ఆసరాగా చేసుకుని బీజేపీపై ఒత్తిడి తీసుకువచ్చి హోదా సాధించేందుకు నూటికి నూరు శాతం ప్రయత్నిస్తామని తెలిపారు.


More Telugu News