ఏపీ ప్రభుత్వం ఈ అంశాలపైనా దృష్టిపెట్టాలి : విశ్రాంత ఐఏఎస్‌ ఐవైఆర్‌

  • విగ్రహాల బహుమతి వరకు సరే సరి
  • హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలి
  • పరోక్షంగా వైసీపీ సర్కారుకు సూచన
ఏపీలో జరుగుతున్న కొన్ని ఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయని, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, వీటిని నియంత్రించడానికి ఏపీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, నవ్యాంధ్ర మాజీ సీఎస్‌ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు పరోక్షంగా సర్కారుకు సూచించారు. ఈ వారంలో ఢిల్లీ  పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ సందర్భంగా వారికి వేంకటేశ్వరస్వామి విగ్రహాలు బహూకరించిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐవైఆర్‌ ట్వీట్‌ చేశారు.

‘గత పాలకులు  ఢిల్లీ వచ్చినప్పుడు శాలువాలుకప్పి వేంకటేశ్వరుని లడ్డూలు అందజేసేవారు. ప్రస్తుత పాలకులు విగ్రహాలు అందించే వరకు వెళ్లారు. బాగుందిగాని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనల నియంత్రణపై కూడా ప్రభుత్వం దృష్టిసారిస్తే బాగుంటుంది’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మొన్న అర్ధరాత్రి బిట్రగుంటలోని వేంకటేశ్వరుని రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. నిన్న పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో అమ్మవారి ఆలయం ముఖద్వారాన్ని కూల్చివేశారు. ఇటువంటి ఘటనలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ విధంగా ట్వీట్‌ చేసి ఉంటారని భావిస్తున్నారు.


More Telugu News