మోదీ, అమిత్ షాలకు టీడీపీ ఎంపీ కనకమేడల లేఖ

  • విభజన చట్టం ప్రకారం అమరావతి రాజధానిగా ఖరారైంది
  • ఏపీకి 3 రాజధానులను అంగీకరిస్తే ఇబ్బందులు తలెత్తుతాయి
  • ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా చూడాలి
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఓ లేఖ రాశారు. 13 జిల్లాలు ఉన్న ఏపీ రాష్ట్రానికి 3 రాజధానులు అంగీకరిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా చూడాలంటూ ఆ లేఖలో విన్నవించారు.

విభజన చట్టం ప్రకారం అమరావతి రాజధానిగా ఖరారైందని, తన పరిధిలో లేని అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని, మూడు రాజధానుల ప్రతిపాదనను కనుక అడ్డుకోకపోతే దేశంపైనే దుష్ప్రభావం పడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. టీడీపీ తొలి నుంచి అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు పలుకుతోందని వారి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా శాసనమండలి రద్దు అంశం గురించీ తన లేఖలో కనకమేడల ప్రస్తావించారు. తన నిర్ణయాలకు శాసనమండలి మద్దతుగా లేదని భావించడం వల్లే  దీని రద్దుకు బిల్లు పెట్టారని, ఈ విషయంలో రాష్ట్రాలు తమ ఇష్టానుసారం వ్యవహరించడం సబబు కాదని అన్నారు. మండలి రద్దుపై ముందుకు వెళ్లే ముందు పరిస్థితులను సమీక్షించాలని ఆ లేఖలో కనకమేడల కోరారు.


More Telugu News