గే యాప్ తయారు చేసి ఎంఎన్ సీ ఉద్యోగులకు వల.. వీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేసిన ఐదుగురి అరెస్టు

  • గే యాప్ తయారు చేసింది నిందితులే..
  • 50 మంది మల్టీ నేషనల్ కంపెనీల ఉద్యోగులకు వల
  • వారు కలుసుకున్నప్పుడు రహస్యంగా వీడియో రికార్డింగ్
  • ఆ వీడియోలు బయటపెడతామంటూ డబ్బులు వసూలు
ఓ ఐదుగురు కలిసి 'గే'ల కోసం డేటింగ్ యాప్ తయారు చేశారు. గేలు ఒకరితో ఒకరు చాటింగ్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి యాప్ లో ఆప్షన్ ఇచ్చారు. ఆ యాప్ లింక్ ను మల్టీ నేషనల్ కంపెనీల ఉద్యోగులకు పంపారు. ఆ యాప్ ద్వారా చేసిన చాటింగ్ లను స్టోర్ చేశారు. ఆయా వ్యక్తులు కలుసుకునేలా ఏర్పాట్లు చేసి, రహస్యంగా వీడియోలు తీశారు. తర్వాత ఆ వీడియోలను బయటపెడతామంటూ బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు గుంజారు. చివరికి పోలీసులకు చిక్కారు. దేశరాజధాని ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ లో పోలీసులు వారిని అరెస్టు చేశారు. గురుగ్రామ్ పోలీస్ క్రైం బ్రాంచ్ ఏసీపీ చెప్పిన వివరాల మేరకు..

సరదాకే తయారు చేసినా..

గురుగ్రామ్ కు చెందిన సంజయ్, సచిన్, నార్ సింగ్, హజారీలాల్, సుమిత్  ఐదుగురూ కలిసి సరదాగా గే డేటింగ్ యాప్ ను తయారు చేశారు. దాని లింక్ ను చాలా మందికి పంపారు. మల్టీ నేషనల్ కంపెనీల ఉద్యోగులు, ట్రాన్స్ జెండర్లు పెద్ద సంఖ్యలో ఆ యాప్ లో నమోదు చేసుకున్నారు. ఒకరితో ఒకరు గే చాటింగ్ చేశారు.

ఇది చూసిన గ్యాంగ్ మెంబర్లు వారు ఒకరినొకరు కలుసుకునేలా రహస్య ప్రాంతాలను సూచించారు. ఉద్యోగులు ఆ ప్రాంతాలకు వెళ్లి కలుసుకున్నప్పుడు, సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు తీశారు. తర్వాత ఆ వీడియోలు నెట్ లో పెడతామని, అందరికీ పంపుతామని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. విషయం బయటపడితే పరువుపోతుందన్న భయంతో చాలా మంది డబ్బులు ఇచ్చారు.  చివరికి ఓ బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పెద్ద పెద్ద ఉద్యోగులు కూడా..

గే డేటింగ్ యాప్ లో నమోదు చేసుకుని ఈ గ్యాంగ్  బ్లాక్ మెయిల్ కు గురైనవారిలో మల్టీ నేషనల్ కంపెనీలకు చెందిన పెద్ద ఉద్యోగులు కూడా ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. మొదట్లో ఈ గ్యాంగ్ సరదాగానే గే డేటింగ్ యాప్ తయారు చేసిందని.. ఈజీగా డబ్బులు వస్తుండటంతో బ్లాక్ మెయిలింగ్ కు దిగిందని చెప్పారు. 50 మందికిపైగా బాధితులు ఉన్నట్టుగా గుర్తించామని తెలిపారు.


More Telugu News