ఓడిపోయామన్న ఆవేశంతో ట్రోఫీని రెండు ముక్కలు చేసిన టీమిండియా యువ సంచలనం!

  • అండర్-19 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించిన యశస్వి జైస్వాల్
  • ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన టీమిండియా కుర్రాళ్లు
  • అతిగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ జట్టు సభ్యులు
  • ఆవేశానికి లోనై ట్రోఫీని ముక్కలు చేసిన జైస్వాల్!
ఇటీవలే ముగిసిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియా రన్నరప్ తో సరిపెట్టుకున్నా, ఆణిముత్యాల్లాంటి భారత కుర్రాళ్లు వెలుగులోకి వచ్చారు. అలాంటి వాళ్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒకడు. ఎడమచేతివాటం ఆటగాడైన జైస్వాల్ దాదాపు ప్రతిమ్యాచ్ లో భారీగా పరుగులు సాధించి క్రికెట్ పండితులను ఔరా అనిపించాడు. బంతిని బలంగా కొట్టడంలో వీరేంద్ర సెహ్వాగ్ ను, కళాత్మకంగా ఆడడంలో రాహుల్ ద్రావిడ్ ను తలపించే ఈ టీనేజర్ భవిష్యత్తులో అగ్రశ్రేణి బ్యాట్స్ మన్ అవడం ఖాయమన్నది విశ్లేషకుల మాట.

అయితే, వరల్డ్ కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడం యశస్వి జైస్వాల్ ను తీవ్రంగా బాధించింది. పైగా, ప్రపంచ విజేతలుగా అవతరించిన బంగ్లా కుర్రాళ్లు ఫైనల్ అనంతరం విజయగర్వంతో ప్రవర్తించిన తీరు జైస్వాల్ ను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఆవేశంలోనే తనకు వరల్డ్ కప్ లో ఇచ్చిన అవార్డును రెండు ముక్కలుగా చేశాడని తెలిసింది. దక్షిణాఫ్రికా నుంచి భారత్ వచ్చిన జైస్వాల్ బ్యాగేజీలో ట్రోఫీ రెండు ముక్కలుగా కనిపించింది. దీనిపై జైస్వాల్ కోచ్ జ్వాలా సింగ్ మాట్లాడుతూ, ట్రోఫీని ముక్కలు చేయడం కొత్తేమీ కాదని, జైస్వాల్ కు తన బ్యాటింగ్ పైనే శ్రద్ధ ఉంటుందని, ఇలాంటి ట్రోఫీల గురించి పెద్దగా పట్టించుకోడని వివరణ ఇచ్చారు.


More Telugu News