బిట్రగుంటలో వేంకటేశ్వరస్వామి రథానికి నిప్పంటించిన దుండగులు!

  • తెల్లవారు జామున ఘటనతో పూర్తిగా దగ్ధమైన రథం
  • మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న రథోత్సవం
  • ఆకతాయిల పనిపట్టాలని పోలీసులను ఆదేశించిన మంత్రి వెల్లంపల్లి
నెల్లూరు జిల్లా బిట్రగుంట వేంకటేశ్వరస్వామి ఆలయం పరిధిలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామివారి రథం ఈ తెల్లవారు జామున దగ్ధమైంది. మార్చి 4న రథోత్సవం జరగనున్న నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గుర్తు తెలియని వ్యక్తులు రథానికి నిప్పంటించడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నారు.

ఆలయానికి చెందిన ఈ ప్రాచీన రథం ఆవరణలో నిలిపి ఉంటుంది. ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. ఆ సందర్భంలో రథాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి కన్నుల పండువగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు. మరో పక్షం రోజుల తర్వాత ఉత్సవం జరగనున్న నేపథ్యంలో జరిగిన ఘటనతో భక్తులు నొచ్చుకున్నారు.

ఘటనపై వెంటనే స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. నిందితులను తక్షణం పట్టుకోవాలని ఆదేశించారు. అలాగే ఆకతాయిల చర్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తక్షణం పునర్నిర్మాణ చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణిని ఆదేశించారు.


More Telugu News