'జగన్‌ సతీమణి భారతి పీఏని మాట్లాడుతున్నా..' అంటూ ఓ వ్యక్తి నయామోసం!

  • ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బు వసూలు
  • మొత్తం ముగ్గురి నుంచి రూ.లక్షకు పైగా వసూలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
ఉద్యోగాలు ఇప్పించడం తనకు చిటికెలో పనని, ఎందుకంటే తాను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతి పీఏనని చెప్పుకుంటూ ఓ వ్యక్తి నయా మోసానికి తెరలేపాడు. నమ్మిన వ్యక్తి నుంచి లక్షకు పైగా వసూలు చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

పోలీసుల కథనం మేరకు... విజయవాడ సమీపంలోని గొల్లపూడికి చెందిన కుమరేశ్వర అఖిలేష్‌ ఐసీఐసీఐ బ్యాంకులో కొన్నాళ్లు డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసి మానేశాడు. గత ఏడాది అక్టోబరులో తిరుమలో గదుల కోసం జగదీష్‌ సత్యశ్రీరాం అనే వ్యక్తిని ఫోన్‌లో సంప్రదించాడు. ఆ సందర్భంలో సత్యశ్రీరాం ‘తాను వై.ఎస్‌.భారతి పీఏ'నని చెప్పుకుంటూ పంచాయతీరాజ్‌ శాఖలో ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే తనను సంప్రదించాలని కోరాడు. ఖాళీగా ఉన్న అఖిలేష్‌ ఇది నిజమేనని అనుకుని ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని సంప్రదించాడు.

తొలుత రూ.60 వేలతో పాటు తన విద్యార్హత ధ్రువపత్రాలు ఇచ్చాడు. అనంతరం అదీ ఇదీ అని చెప్పి మరికొంత మొత్తం తీసుకున్నాడు. తీరా ఎప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో ఆరా తీస్తే అతను అసలు భారతి పీఏనే కాదని తెలిసింది. పైగా తనలాగే అతను మరో ఇద్దరిని కూడా మోసం చేశాడని తెలుసుకుని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


More Telugu News