నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీయడానికి అనుమతివ్వాలన్న కేంద్రం పిటిషన్ పై.. సుప్రీంలో రేపు విచారణ
ఒకరొకరుగా పిటిషన్లు వేస్తూ జాప్యం జరిగేలా చేస్తున్న దోషులు
సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్న కేంద్రం
వేర్వేరుగా శిక్ష అమలు చేసేలా అనుమతివ్వాలని వినతి
నిర్భయ కేసులో ఉరిశిక్ష పడినవారందరికీ ఒకేసారి కాకుండా వేర్వేరుగా శిక్ష అమలు చేసే అవకాశం ఇవ్వాలన్న కేంద్రం పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. ఏదైనా ఒక కేసులో ఒకే శిక్ష పడిన వారందరికీ శిక్షను ఒకేసారి అమలు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా నిర్భయ దోషుల ఉరి అమలు వాయిదా పడుతూ వస్తోంది.
వేర్వేరుగా పిటిషన్లు వేస్తూ..
దోషులు ఒకరొకరుగా కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు వేస్తూ పోవడం, తర్వాత ఒకరొకరుగా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం, సుప్రీం ఆదేశాలపై రివ్యూ పిటిషన్లు వేయడం వంటివి చేస్తూ.. ఉరిశిక్ష అమలుకాకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి వేర్వేరుగా శిక్ష అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
ఒక్కరికే ఆప్షన్లు మిగిలాయి
నిర్భయ కేసులో ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాలకు ఉరిశిక్ష పడింది. ఈ నలుగురిలో పవన్ గుప్తా మినహా మిగతా వారంతా కోర్టుల్లో పిటిషన్లు వేసి, రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం వెళ్లి అన్ని మార్గాలను వినియోగించుకున్నారు. పవన్ గుప్తాకు క్యూరేటివ్ పిటిషన్, ఆపై రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ వేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అందరికీ ఒకేసారి శిక్ష అమలు చేయాలన్న తీర్పు నేపథ్యంలో నలుగురి ఉరిశిక్ష అమలు వాయిదా పడుతూ వస్తోంది. దీంతో వేర్వేరుగా శిక్ష అమలు కోసం కేంద్రం పిటిషన్ వేసింది.
దోషుల తీరుతో సమస్యలు
దోషుల తీరు వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని కోర్టుకు విన్నవించింది. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత విచారణ జరుపుతామని కోర్టు ప్రకటించింది. ఇక పవన్ గుప్తా విషయాన్ని త్వరగా తేల్చేందుకు సీనియర్ అడ్వొకేట్ అంజనా ప్రకాశ్ ను అమికస్ క్యూరీ (కోర్టు సహాయకులు)గా నియమించింది.