వారణాసి, ఇండోర్ మధ్య మూడో ప్రైవేట్ రైలు
- ఈనెల 16న పట్టాలెక్కనున్న 'కాశీ మహాకాళ్ ఎక్స్ ప్రెస్'
- 20 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి
- ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో నిర్వహణ
భారత దేశంలో ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో మూడో ప్రైవేటు రైలు మరో రెండు రోజుల తర్వాత పట్టాలెక్కబోతోంది. వారణాసి, ఇండోర్ మధ్య నడపనున్న ఈ రైలును ఈ నెల 16వ తేదీన లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. 20వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.
ఐఆర్‌సీటీసీ నడపనున్న ఈ ప్రైవేట్ రైళ్లలో తొలి రైలు 'తేజస్ ఎక్స్ ప్రెస్' గత ఏడాది అక్టోబరు 4న పట్టాలెక్కిన విషయం తెలిసిందే. లక్నో-ఢిల్లీ మధ్య తిరిగే ఈ రైలుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పచ్చజెండా ఊపారు. తాజాగా ఐఆర్‌సీటీసీ నడపనున్న 'కాశీ మహాకాళ్ ఎక్స్ ప్రెస్' వారణాసి, ఇండోర్ల మధ్య వారానికి మూడు రోజులపాటు నడుస్తుంది. మూడు జ్యోతిర్లింగాలైన ఓంకారేశ్వర్ (ఇండోర్, మధ్యప్రదేశ్), మహాకాళేశ్వర్ (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), కాశీ విశ్వనాథ (వారణాసి, ఉత్తరప్రదేశ్)లతోపాటు ఇండోర్, భోపాల్ వంటి పారిశ్రామిక, విద్యా కేంద్రాల మీదుగా ఈ రైలు నడుస్తుంది.