హైదరాబాద్‌లో ఇక డీజిల్ వాహనాలకు చెల్లుచీటీ.. 12 ఏళ్లు దాటితే నిషేధం?

  • డీజిల్ వాహనాలపై పన్నును భారీగా పెంచాలని నిర్ణయం
  • ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్న యోచన
  • ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
హైదరాబాద్‌లో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఢిల్లీ లాంటి పరిస్థితులు ఎదురుకావడానికి ముందే మేల్కొనాలని భావిస్తున్న ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రవాణశాఖకు సూచించినట్టు తెలుస్తోంది. కాలుష్య నియంత్రణలో భాగంగా నగరంలో డీజిల్ వాహనాలను నియంత్రించాలనేది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యంగా 12 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను నిషేధించాలని నిర్ణయించినట్టు సమాచారం.

నగరంలో ప్రస్తుతం 15 లక్షల డీజిల్ వాహనాలు తిరుగుతున్నాయి. వీటి నుంచి పెద్ద ఎత్తున కార్బన్ ఉద్గారాలు విడుదలవుతున్నాయి. దీంతో డీజిల్ ఆధారిత వాహనాల సంఖ్య మరింత పెరగకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. పెట్రోలు వాహనాలతో పోలిస్తే డీజిల్ వాహనాలపై ప్రస్తుతం రెండు శాతం పన్ను అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా ప్రజలను అటువైపు ఆకర్షించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల తయారీలో రవాణా శాఖ అధికారులు తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది.


More Telugu News