బంగాళాఖాతంలో పడవ ప్రమాదం: 15మంది రోహింగ్యాల మృతి

  • పరిమితికి మించి ప్రయాణం చేయడంవల్లే ప్రమాదం
  • పడవలో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు
  • 73 మందిని కాపాడిన బంగ్లాదేశ్ తీరప్రాంత గస్తీ సిబ్బంది
రోహింగ్యా శరణార్థులు ప్రయాణిస్తున్న ఓ పడవ నిన్న రాత్రి బంగాళాఖాతంలో మునిగిపోవడంతో 15 మంది మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి మలేషియాకు 130 మంది రోహింగ్యా శరణార్థులతో వెళుతున్న పడవ సముద్రంలో మునిగిపోయింది. పరిమితికి మించి పడవలో ప్రయాణించడంవల్లే పడవ మునిగిపోయిందని ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రయాణికులు చెబుతున్నారు.

పడవలో ప్రయాణించడానికి 50 మందికి వీలుందని అన్నారు. పడవ మునకకు సంబంధించిన సమాచారం అందుకున్న బంగ్లాదేశ్ తీరప్రాంత గస్తీ సిబ్బంది వెంటనే స్పందించడంతో చాలామంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గస్తీ సిబ్బంది 73 మందిని రక్షించారు. ఈ పడవలో మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

రోహింగ్యాలు మయన్మార్ కు చెందిన ఓ ముస్లిం తెగ. వీరిపై ఆ దేశ సైన్యం మూడేళ్ల క్రితం దాడులు జరపగా వేలసంఖ్యలో రోహింగ్యాలు మరణించారు. లక్షల సంఖ్యలో బంగ్లాదేశ్ కు వలసపోయారు. వీరిలో చాలామంది మలేషియాకు చేరుకొని ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా పడవలో రోహింగ్యాలు మలేషియాకు సముద్రమార్గంలో ప్రయాణిస్తూ ప్రమాదంలో చిక్కుకున్నారు. పడవ ప్రమాదంపై సేవ్ ది చిల్డ్రన్ ఇంటర్నేషనల్ సంస్థ విచారం వ్యక్తం చేసింది. రోహింగ్యాలను తిరిగి తన దేశానికి రప్పించుకోవాలని మయన్మార్ ను  కోరింది.


More Telugu News