యూపీ సీఎం యోగి చేసిన ‘బిర్యానీ’ కామెంట్లకు సెటైర్ గా బిర్యానీ ఆర్డర్లు
సోషల్ మీడియాలో ‘బిర్యానీ సెలబ్రేషన్స్’ పోస్టులు
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం టైంలో అనూహ్యంగా ఓ కొత్త ముచ్చట ఆసక్తిగా మారింది. ఆప్ విజయం ఖరారైన మంగళవారం మధ్యాహ్నం నుంచి కూడా ఢిల్లీ వ్యాప్తంగా బిర్యానీ సేల్స్ ఒక్కసారిగా బాగా పెరిగిపోయాయి. దాదాపు అన్ని రెస్టారెంట్లకు భారీగా బిర్యానీ ఆర్డర్లు వెల్లువెత్తాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ ఎలక్షన్ల ప్రచారంలో చేసిన ‘బిర్యానీ’ కామెంట్లు, వాటిని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన పోస్టులే దీనికి కారణమని రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు. దీంతో తాము కూడా బిర్యానీపై డిస్కౌంట్లు ఇస్తున్నామని అంటున్నారు.
యోగి ఏమన్నారు?
సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్ బాగ్ ప్రాంతంలో రెండు నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆందోళనల వెనుక కేజ్రీవాల్ హస్తం ఉందని, ఆప్ పార్టీ షహీన్ బాగ్ ఆందోళనకారులకు బిర్యానీ సప్లై చేస్తోందని యూపీ సీఎం ఆదిత్యనాథ్ విమర్శించారు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయితే ఆప్ విజయం ఖాయమైనప్పటి నుంచి.. యోగి కామెంట్స్ ను కోట్స్ చేస్తూ ‘బిర్యానీ తింటూ సెలబ్రేషన్స్ చేసుకుందాం’ అని సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తాయి. దాంతో ఆప్, కేజ్రీవాల్ అభిమానులంతా బిర్యానీ సెంటర్ల బాట పట్టారు.
రెస్టారెంట్లూ డిస్కౌంట్ ఇచ్చాయి
ఆప్ కార్యకర్తలు, కేజ్రీవాల్ అభిమానులకు తోడుగా రెస్టారెంట్లు, హోటళ్ల వాళ్లు బిర్యానీపై భారీగా డిస్కౌంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. కొందరు ఒక బిర్యానీకి మరో బిర్యానీ ఫ్రీ అంటే.. కొన్నిచోట్ల 25 పర్సెంట్ వరకూ డిస్కౌంట్ ఇచ్చారు.