కేజ్రీవాల్‌ను హనుమ ఆశీర్వదించాడు, గెలిచారు.. బడి పిల్లలకూ స్వామి అనుగ్రహం కావాలి: బీజేపీ నేత కైలాశ్

  • కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు  
  • తన గెలుపునకు కారణం హనుమాన్‌ అని చెప్పారు
  • కాబట్టి పాఠశాల విద్యార్థులకు కూడా హనుమ ఆశీర్వాదం కావాలి
  • బడుల్లో హనుమాన్‌ చాలీసా పారాయణం చేయడం తప్పనిసరి చేయాలి 
'నేను హనుమంతుడి భక్తుడిని' అంటూ ఢిల్లీ ఎన్నికల ముందు సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఎంత హాట్ టాపిక్‌గా మారాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. చివరకు ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడో సారి ఘన విజయం సాధించారు. దీంతో బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా.. కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'అరవింద్ కేజ్రీవాల్‌ జీ తన గెలుపునకు కారణం హనుమాన్‌ జీనేనని చెప్పారు. కాబట్టి, పాఠశాల విద్యార్థులకు కూడా ఇప్పుడు హనుమంతుడి ఆశీర్వారం కావాలి' అని ట్వీట్ చేశారు.

'ఢిల్లీలోని అన్ని పాఠశాలలు, మదర్సాలతో పాటు ఇతర విద్యా సంస్థలన్నింటిలోనూ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయడం తప్పనిసరి చేయాల్సిన సమయం వచ్చింది. బజరంగబలీ అనుగ్రహం నుంచి చిన్నారులను దూరం చేయడం ఎందుకు?' అని కైలాశ్ విజయవర్గియా ప్రశ్నించారు.

కాగా, నిన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన తర్వాత సీఎం కేజ్రీవాల్‌ కన్నాట్ ప్లేస్‌లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.


More Telugu News