అందుకే, మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయాలు చెల్లవు: పిల్లి సుభాష్ చంద్రబోస్

  • కోర్టుకు ప్రశ్నించే అధికారం లేదని షరీష్ అలా మాట్లాడతారా?
  • ఎప్పుడు బడితే అప్పుడు విచక్షణాధికారాలను ఉపయోగించరు
  • అసెంబ్లీ కార్యదర్శిపై బెదిరింపు ఆరోపణలు కరెక్టు కాదు
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీలకు పంపుతూ ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయాలు ఏవీ చెల్లవని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మండలిలో తాను ఏ చర్యలు తీసుకున్నా కోర్టుకు ప్రశ్నించే అధికారం లేదన్న ఒకే ఒక్క కారణంతో చైర్మన్ గా తనకు విచక్షణాధికారం ఉందని షరీఫ్ మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఏదైనా ఒక విషయం సందిగ్ధంలో పడినప్పుడు చైర్మన్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకోవచ్చు, అయితే, వీటిని ఉపయోగించేందుకు సమయం, సందర్భం ఉంటాయి కనుక ఎప్పుడు బడితే అప్పుడు, ఎక్కడబడితే అక్కడ, ఎవరి ప్రయోజనాలు కాపాడాలంటే వారివి కాపాడటానికి వీటిని ఉపయోగించడానికి వీల్లేదు కనుక ఆయన తీసుకున్న నిర్ణయాలేవీ చెల్లవని అభిప్రాయపడ్డారు. ఈ రెండు బిల్లుల ఆమోదానికి అసలు ఓటింగ్ నిర్వహించకుండానే, సెలెక్ట్ కమిటీలకు పంపడమన్నది కరెక్టు కాదని అన్నారు.

యనమలపై మండిపడ్డ పిల్లి సుభాష్ చంద్రబోస్

వైసీపీ సభ్యులు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని యనమల రామకృష్ణుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తూ ఎవరిని తప్పుదారి పట్టిస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీకి తప్పుడు సలహాలు ఇవ్వడం వల్లే ఆ పార్టీని బోర్లా పడేశారని విమర్శించారు. అసెంబ్లీ కార్యదర్శిని వైసీపీ బెదిరిస్తోందన్న ఆరోపణలు కరెక్టు కాదని అన్నారు. సెలెక్ట్ కమిటీలను చూసి భయపడేంత దౌర్భాగ్యం తమకు లేదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తామని మాట్లాడుతున్న యనమలకు ఇంకా తాము అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని అనుకుంటున్నారని సెటైర్లు విసిరారు.


More Telugu News