కోడిమాంసం తినడం వల్ల కరోనా వైరస్ రాదు... స్పష్టం చేసిన కేంద్రం
- ప్రబలుతున్న కరోనా
- వైరస్ వ్యాప్తిపై అపోహలు
- చికెన్ తినడంపై స్పష్టత ఇచ్చిన కేంద్ర పశుసంరక్షణ మంత్రిత్వ శాఖ
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భయాందోళనలు కలిగిస్తున్న కరోనా వైరస్ చికెన్, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులు తినడం వల్ల సోకదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జంతువులు, పక్షుల నుంచి కరోనా వైరస్ మనుషులకు వ్యాప్తి చెందుతోందన్న పూర్వ కథనాలతో ప్రజల్లో అపోహలు నెలకొన్నాయి. ముఖ్యంగా కోడిమాంసం తింటే కరోనా వైరస్ సోకుతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర పశుసంరక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. చికెన్ తో పాటు ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులు ఏవీ కరోనా వైరస్ వ్యాప్తికి దారితీయవని సదరు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర పశుసంరక్షణ శాఖ కమిషనర్ ప్రవీణ్ మాలిక్ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఓ లేఖ రాశారు.
పౌల్ట్రీ ఉత్పత్తుల కారణంగా కరోనా వైరస్ వ్యాపిస్తుందనడానికి ఎక్కడా దాఖలాలు లేవని స్పష్టం చేశారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (హూ) సూచించిన మేర శుభ్రతా, ఆరోగ్య ప్రమాణాలు పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రవీణ్ మాలిక్ తన లేఖలో తెలిపారు. గతంలో సార్స్, మెర్స్ వైరస్ వ్యాప్తికి పౌల్ట్రీ ఉత్పత్తుల కారణం కాదని తేలిందని వెల్లడించారు.