తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం
- రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది
- నిధులు తెచ్చుకునే విషయంలో ప్రభుత్వం విఫలం
- కేంద్రం తీరు కూడా సరికాదు.
తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈరోజు ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ పన్ను వసూళ్లలో వెనుకబడ్డారని, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని విమర్శించారు. బిల్లులపై కేంద్రానికి మద్దతు ఇస్తున్న టీఆర్ఎస్ నిధులు తెచ్చుకోవడంలో మాత్రం విఫలమవుతోందన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎన్ని, ఆ నిధులు ఎందుకు రాబట్టలేకపోతున్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్రం కూడా రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధులు పంచకుండా, జమ్ముకశ్మీర్ వంటి రాష్ట్రాలకు కేటాయించడం సరికాదన్నారు. ఎల్ ఐసీ లాంటి లాభాల్లో ఉన్న సంస్థలను ఎందుకు ప్రైవేటీకరించడమని ప్రశ్నించారు.