ఢిల్లీ ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమయ్యాయి

  • ఆప్‌కే అధికారం అన్న ఎక్కువ సంస్థలు
  • నలభైకి మించి స్థానాలు వస్తాయని అంచనా
  • మరింత మెరుగైన స్థితికి చేరిన సామాన్యుడు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక ఫలితాలు చూస్తే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు దాదాపు నిజమయ్యాయని చెప్పొచ్చు. అన్ని చానల్స్‌, సంస్థలు ఆప్‌దే మళ్లీ అధికారం అని చెప్పినప్పటికీ సీట్ల విషయానికి వచ్చేసరికి తలో లెక్క చెప్పాయి. అలాగే ఒకటి రెండు సంస్థలు తప్పమిగిలిన అన్ని సంస్థలు ఆ పార్టీకి నలభై నుంచి యాభై స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. అయితే ఆప్‌ ఈ అంచనాలకు మించి 57 స్థానాలు సాధించే దిశగా పరుగు పెడుతుండడం విశేషం. ఇదే ట్రెండ్‌ కొనసాగితే న్యూస్‌ ఎక్స్‌ అంచనాలు నిజమయ్యాయని చెప్పొచ్చు. ఆ సంస్థ ఆప్‌కు 53 నుంచి 57 స్థానాలు వస్తాయని, బీజేపీకి 11 నుంచి 17 సీట్లు వస్తాయని చెప్పింది.

జన్‌కీబాత్‌ కూడా ఆప్‌కు 55 స్థానాలు రావొచ్చని, బీజేపీకి 15 సీట్లు వస్తాయని తేల్చింది. ఇక, టైమ్స్‌ నౌ, ఇండియా టీవీ, న్యూస్‌ 18లు ఆప్‌కి 44, బీజేపీకి 26 స్థానాలు వస్తాయని చెప్పాయి. సుదర్శన టీవీ ఆప్‌కు 40 నుంచి 45 స్థానాలు, బీజేపీకి 24 నుంచి 28 స్థానాలు వస్తాయంది.

రిపబ్లికన్‌ టీవీ ఆప్‌కు 48 నుంచి 61 స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీకి 9 నుంచి 21 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదిలావుంటే మూడు నాలుగు సంస్థలు కాంగ్రెస్‌ పార్టీకి ఒకటి నుంచి నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉందని చెప్పినా ఆ అంచనాలేవీ నిజం కాలేదు.


More Telugu News