: ఎల్లుండి వైకాపాలో చేరనున్న మోపిదేవి అనుచరగణం


మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అందుకు ముహూర్తమూ ఖరారైంది. ఈ నెల 5న పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వారు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిజాంపట్నంలో నేడు మోపిదేవి నివాసంలో ఆయన సోదరుడు హరనాథ బాబు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, అనుచరులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారు. తన అన్నకు ఆరోగ్యం క్షీణించినా వైద్య సదుపాయం అందించే దిశగా ప్రభుత్వం స్పందించడంలేదని హరనాథబాబు ఆక్షేపించారు.

రేపల్లె నియోజకవర్గంలో పార్టీకోసం అహరహం శ్రమించిన మోపిదేవికి రాష్ట్ర, ఢిల్లీ నేతలు ద్రోహం చేశారని సమావేశానికి హాజరైన అనుచరగణం ఆరోపించింది. అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నామని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా త్వరలోనే జగన్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ఇప్పటికే కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News