: ఇవి రక్షకాలు కాదు భక్షకాలు!
మన శరీరంలో వ్యాధినిరోధక శక్తికి తోడ్పడేవి తెల్లరక్త కణాలు. అందుకే వీటిని రక్షక కణాలు అని కూడా అంటారు. అయితే కొన్ని తెల్లరక్త కణాలు ఇందుకు వ్యతిరేకంగా పనిచేస్తూ మన శరీరంలో క్యాన్సర్ వ్యాధి వ్యాప్తికి దోహదం చేస్తున్నాయట. ఈ విషయం శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో గుర్తించబడిరది.
కెనడాలోని రీసెర్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెక్గిల్ యూనివర్సిటీ హెల్త్ సెంటర్ (ఆర్ఐ-ఎంయూహెచ్సీ)లో జరిగిన ఒక అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ప్రధానంగా పనిచేసే తెల్లరక్త కణాలు క్యాన్సర్ కణాల క్రియాశీలతను పెంచుతూ, క్యాన్సర్ కణాల వ్యాప్తికి కారణమవుతూ మన శరీరానికి విద్రోహక కణాలుగా పనిచేస్తున్నట్టు ఈ అధ్యయనంలో బయటపడింది. ఇన్ఫెక్షన్తో పోరాడే తెల్లరక్త కణాలు క్యాన్సర్ కణాలకు సాయంచేసి అవి చురుగ్గా మారి క్రియాశీలకంగా పనిచేసి, రెండవ దశ క్యాన్సర్ కణితులుగా వ్యాపించేందుకు కొన్ని తెల్ల రక్త కణాలు ఉపకరిస్తున్నాయట. క్యాన్సర్ వ్యాప్తికి సంబంధించిన ఈ కొత్త విషయాన్ని ప్రపంచలోనే మొదటిసారిగా తామే కనుగొన్నామని పరిశోధకులు డాక్టర్ లోరెంజో ఫెర్రి తెలిపారు. గతంతో తాము చేసిన పరిశోధనల్లో దీనికి సంబంధించిన పలు వివరాలను గుర్తించామని ఫెర్రి తెలిపారు. ఇన్ఫెక్షన్కు తెల్లరక్త కణాల ప్రతిస్పందన (ఇన్ఫ్లమేషన్), మెటాస్టాటిస్కు మధ్య సంబంధాన్ని కల్చర్ చేసిన కణాలు, ఎలుకలపై పరిశోధనల ఆధారంగా తాము ఈ విషయాన్ని గుర్తించినట్టు ఫెర్రి వివరించారు.