: ఉక్కుమనిషి సంకల్పం తిరుగులేనిది: అద్వానీ
హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేయడంలో ఉక్కు మనిషి సర్థార్ వల్లభాయ్ పటేల్ చూపిన తెగువ తిరుగులేనిదని బీజేపీ కురువృద్దుడు అద్వానీ ప్రశంసించారు. హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ విలీనం విషయంలో అప్పటి ప్రధాని ఐక్యరాజ్యసమితిని ఆశ్రయిద్దామని సూచించినప్పటికీ, ఉక్కు మనిషి తాను అనుకున్నదాన్ని ధైర్యంగా అమలు చేసి చూపించారని తన బ్లాగ్ లో పేర్కొన్నారు. పటేల్ వద్ద పనిచేసిన వీపీ మీనన్ రాసిన పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని అద్వానీ ఈ పోస్ట్ చేశారు. హైదరాబాద్ విలీన ప్రతిపాదనను నిజాం నవాబు ఒప్పుకోకపోవడంతో సర్ధార్ వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని పంపి పనిపూర్తిచేశారు.
నెహ్రూ జమ్మూకాశ్మీర్ విలీన ప్రక్రియలో అనుసరించిన విధానాన్ని పాటిద్దామన్నప్పటికీ ఆయన అభిప్రాయానికి వ్యతిరేకంగా సైన్యాన్ని పంపి, హైదరాబాద్ ను విలీనం చేయడాన్ని అద్వానీ గుర్తు చేశారు. జమ్మూకాశ్మీర్ లో నెహ్రూ అనుసరించిన విధానం కారణంగా ఉగ్రవాదంతో ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉపసంహరించాలని డిమాండ్ చేసారు. దీంతో ఒమర్ అబ్దుల్లా అద్వానీపై విమర్శలు గుప్పించారు.