: రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచితేనే బాగుంటాం: శైలజానాథ్
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాల్సిన అవసరం ఉందని మంత్రి శైలజానాథ్ అన్నారు. హైదరాబాద్ లోని లేక్ వ్యూ అతిథి గృహంలో దిగ్విజయ్ సింగ్ ను కలిసిన అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే తెలుగువారంతా నష్టపోతారని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా మన రాష్ట్రం ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడడానికి చాలా మంది దిగ్గజాలు కష్టపడ్డారన్న శైలజానాథ్, వారి శ్రమను బూడిదపాలు చేయొద్దని కోరారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేయాల్సిఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, తమందరిదీ ఒకే మాట, ఒకే బాట అని అన్నారు. ఏదైనా విపరీత నిర్ణయం తీసుకుంటే తమకు ముందుగా తెలపాలని, తమ ప్రాంత ప్రజల మనోభావాలను తెలుసుకోవాల్సి ఉందనీ అన్నారు. ఆనం వివేకానంద రెడ్డి మాట్లాడుతూ, తమ నిర్ణయం వెనుక స్వార్థం లేదని, తెలంగాణ నేతల పోరాటం వెనుక అధికారమనే స్వార్థముందని అన్నారు.