: నిద్రతగ్గితే బరువు పెరుగుతాం
నిద్ర తక్కువగా ఉంటే అలాంటి వారి బరువు కూడా పెరుగుతుందట. సహజంగా మనకు చాలినంత నిద్ర లేకుంటే ఇక ఆ రోజంతా కూడా దాని ప్రభావం మనపై ఎక్కువగానే ఉంటుంది. పని చేయడానికి పెద్దగా ఉత్సాహం చూపించలేం. అయితే నిద్రలేమి వల్ల మన శరీర బరువు కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిద్రలేమి, ఆలస్యంగా నిద్రపోవడం వంటివి ఆరోగ్యవంతులైన వారిలో కూడా బరువు పెరగడానికి దోహదం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. బాగా పొద్దుపోయేదాకా మేలుకొని ఉండడంవల్ల అలాంటి వారిలో కెలొరీల వినియోగం బాగా పెరుగుతుంది. అలాగే అంతసేపు మేలుకుని ఉండడం వల్ల వారి ఆహారం తీసుకునే తీరు కూడా మారుతుంది. పొద్దుపోయిన తర్వాత తీసుకునే ఆహారంలో ముఖ్యంగా కొవ్వు పదార్ధాలను స్వీకరించే వారిలో కెలోరీల వినియోగం కూడా ఎక్కువగానే ఉంటుందని వారు విశ్లేషించారు. శాస్త్రవేత్తలు 22 నుండి 25 సంవత్సరాల వయసున్న వారిపై ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని చెబుతున్నారు. కాబట్టి చక్కగా కంటినిండా నిద్రపోదాం... బరువు పెరుగుదలను తగ్గించుకుందాం...!