: సబీనా పార్క్ లో టాసే కీలకం!
ఒకప్పుడు పేస్ కు విశేషంగా సహకరించిన వెస్టిండీస్ లోని సబీనా పార్క్ పిచ్ కాలగమనంలో మందకొడిగా తయారైంది. ఇది గణాంకాలు చెప్పేమాట. అప్పట్లో ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయాలంటే ప్రత్యర్థి జట్లు హడలిపోయేవంటే అతిశయోక్తికాదు. కానీ, రానురాను ఈ పేస్ ట్రాక్ కాస్తా నెమ్మదించింది. అటు బౌలింగ్ కూ సహకరించక, ఇటు బ్యాట్స్ మెన్ కూ అక్కరకురాక.. జట్లు టాస్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. ఈ పిచ్ పై మ్యాచ్ ఆరంభంలో ఉండే కాస్తోకూస్తో తేమ పేసర్లకు ఉపయోగపడినా.. ఇన్నింగ్స్ సాగే కొద్దీ బౌలర్లు చెమటోడ్చాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
ఇక బ్యాట్స్ మెన్ కయితే బంతి బ్యాట్ పైకి సరిగా రాక టైమింగ్ కుదరక నానాపాట్లు పడడం ఈ ముక్కోణపు టోర్నీ ఆరంభ మ్యాచ్ లో చూశాం. గేల్ వంటి విధ్వంసక వీరుడు కూడా బంతిని చివరివరకు గమనించిన తర్వాతే హిట్టింగ్ కు ఉపక్రమించాల్సి వచ్చింది. అయితే, టీమిండియాలో అన్ని రకాల పరిస్థితులకు సర్దుకుపోగల ధావన్, కోహ్లీ, ధోనీ వంటి బ్యాట్స్ మెన్ ఉన్నారు కాబట్టి, విండీస్ తో భారత్ మ్యాచ్ ను ఫ్యాన్స్ చక్కగానే ఆస్వాదించవచ్చు.