: 'సైబోర్గ్' మళ్ళీ వస్తున్నాడు!
సైబోర్గ్.. అటు మనిషి అనలేం.. ఇటు రోబో అని పిలవలేం. ఓ విధంగా రక్తమాంసాలున్న యంత్రం అనవచ్చు. 1984లో విడుదలైన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ టెర్మినేటర్ సినిమాలో తొలిసారి ఈ సైబోర్గ్ లను పరిచయం చేశాడు చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరాన్. ఇనుప కండలు.. ఉక్కునరాలు వాటి మధ్య రక్తం, దానిపైన చర్మం.. మెదడులో కంప్యూటర్ చిప్ ఇలాంటి శరీర నిర్మాణంతో సైబోర్గ్ తెరపై దర్శనమివ్వడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ టెర్మినేటర్ చిత్రంలో హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ కూడా ఓ సైబోర్గే. ఆయన చేసే సాహసవిన్యాసాలు ఆ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిపించాయి.
ఇప్పటివరకు ఈ హిట్ చిత్రానికి నాలుగు సీక్వెల్స్ రాగా.. అన్నీ నిర్మాతల జేబులు నింపాయి. తాజాగా ఈ పరంపరలో ఐదో చిత్రాన్ని తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పారమౌంట్ స్టూడియోస్, అన్నపూర్ణ పిక్చర్స్, స్కైడేన్స్ కలిసి ఈ సీక్వెల్ నెంబర్ ఫైవ్ ను ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్ణయించాయి. 2015 జూన్ 26న టెర్మినేటర్-5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు అప్పుడే ముహూర్తం కూడా ఖరారు చేశారు.
కాగా, టెర్మినేటర్ సిరీస్ లో ఇప్పటిదాకా మూడు సినిమాల్లో హీరోగా నటించిన ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తాజా చిత్రంలోనూ కథానాయకుడి పాత్ర పోషిస్తాడని తెలుస్తోంది. ఆయన ఇప్పటికే తన అంగీకారం తెలిపారు. గతకొన్నేళ్ళుగా అమెరికా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈ కండలరాయుడు కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.