: ఫేస్ బుక్ లో శృంగార వాణిజ్య ప్రకటనలపై కొరడా
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో ఇక శృంగార, హింసాత్మక వాణిజ్య ప్రకటనలకు చోటు ఉండదు. మహిళలను కించపరిచే విధంగా ఉండే ఎలాంటి వాణిజ్య ప్రకటనలను తాము అనుమతించబోమని ఫేస్ బుక్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఫేస్ బుక్ లో అభ్యంతరకర రీతిలో ప్రకటనలు, సమాచారం ఉందంటూ నెలక్రితం పలు సంస్థలు ఫేస్ బుక్ నుంచి తమ యాడ్స్ ను ఉపసంహరించుకున్నాయి. మహిళల పట్ల హింసను సమర్థించే రీతిలో ఫేస్ బుక్ వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ కఠినచర్యలకు శ్రీకారం చుట్టింది.
అజ్ఞాతవ్యక్తులు పోస్ట్ చేసే పోర్నోగ్రాఫిక్ సమాచారం, విద్వేషపూరిత వ్యాఖ్యలు, బెదిరింపులు వంటి అవాంఛనీయ చర్యలు ఇతర ఖాతాదారులను అసౌకర్యానికి గురిచేస్తున్నాయని ఫేస్ బుక్ భావిస్తోంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల ముంది ఖాతాదారులను కలిగివున్న ఈ విఖ్యాత నెట్ వర్క్ కు 85 శాతం ఆదాయం యాడ్స్ ద్వారానే లభిస్తోంది. తాజా చర్యతో తమ ఆదాయానికి వచ్చిన ఢోకాయేమీ లేదని ఫేస్ బుక్ వర్గాలంటున్నాయి.