: తన పాత్రను తెర మీద చూసి ఏడుపు ఆపుకోలేకపోయిన ఆటగాడు
'భాగ్ మిల్కా భాగ్' సినిమాను చూసి ఏడుపు ఆపుకోలేకపోయానని క్రీడా దిగ్గజం మిల్కాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తన గతజీవితాన్ని కళ్లకు కట్టాయని, ఆయా సన్నివేశాలు వస్తున్నప్పుడు భావోద్వేగాలు నియంత్రించుకోవడం తన వల్లకాలేదని ఈ ఫ్లైయింగ్ సిఖ్ తెలిపారు. తన కెరీర్ ప్రారంభంలో తినడానికి తిండిలేక, సరైన ఉపాధిలేక తీవ్ర ఇబ్బందుల పాలయ్యానని గతాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాలో ఫరాన్ అఖ్తర్ తనకు నకలులా ఉన్నాడని అభినందించారు. ఫరాన్ అఖ్తర్, రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా అద్భుతంగా సినిమాను తీశారని అన్నారు.
1960 నుంచి తాను సినిమాలు చూడలేదని, తాను చివరి సారిగా 'శ్రీ 420' సినిమాను చూసానని గుర్తు చేసుకున్నారు. ఇప్పటివరకు తాను ప్రాతినిధ్యం వహించిన క్రీడలో తన వారసుడిగా క్రీడాకారుడు కనపడకపోవడం తనకు లోటుగా కనిపించేదని, అయితే తాను చనిపోయేలోపు భారతదేశానికి మెడల్ అందించే క్రీడాకారుడు వస్తాడని మిల్కాసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా మరింత మందిని అందుకు ప్రేరేపిస్తుందని ఆయన తెలిపారు.