: ఆ ఎంపీ ఎన్నికల ఖర్చు 29వేల నుంచి 8 కోట్లకు
దేశ ఎన్నికలు ఎంత డబ్బు మయమయ్యాయో ఓ సీనియర్ లోక్ సభ సభ్యుడు కళ్లకు కట్టినట్లు తెలియజేశారు. మహారాష్టలోని బీడ్ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ గోపీనాథ్ ముండే 2009 ఎన్నికల సందర్భంగా తాను 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలియజేశారు. 1980లో తాను మొదటి సారిగా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 29,000 రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయని.. గత ఎన్నికల్లో వ్యయం 8 కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు తెలిపారు. అంటే దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో గెలుపు కోసం నేతలు ఏ స్థాయిలో నోట్ల కట్లలను ఖర్చు చేస్తున్నారో ఊహించవచ్చు. ముంబైలో బియాండ్ బిలియన్ బ్యాలెట్స్ అనే పుస్కకావిష్కరణ సభలో పాల్గొన్న సందర్భంగా గోపీనాథ్ ఈ వివరాలు వెల్లడించారు. ఇదే సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు.