: ఈస్ట్రోజెన్ లోపంతో యవతులనూ వదలని గుండె జబ్బులు
యువతులు గుండె జబ్బులకు గురికారనే విశ్వాసానికి కాలంచెల్లింది. 20 నుంచి 40 ఏళ్ల మగువలు కూడా గుండె జబ్బులకు గురౌతున్నారు. జీవన శైలిలో మార్పుల వల్ల ఈస్ట్రోజోన్ హార్మోను లోపమేర్పడి గుండెజబ్బులకు దారి తీస్తుందని హీల్ ఫౌండేషన్ పరిశోధనల్లో తేలింది. కార్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జయదేవ హృద్రోగచికిత్సాలయం సంచాలకుడు ప్రోఫెసర్ సీఎస్ మంజునాథ్ చేసిన పరిశోధన వివరాలను బెంగళూరులో విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 600 మంది వైద్య నిపుణుల అభిప్రాయాల ప్రాతిపదికన అధ్యయన నివేదిక రూపొందించారు. గత ఐదేళ్లలో హృద్రోగాలకు గురయ్యే యువతుల సంఖ్య 15 శాతానికి పెరిగిందని తెలిపారు. రుతుక్రమం కొనసాగుతున్న మహిళల్లో గుండెజబ్బులు ఏర్పడవనే నమ్మకం ఉండేదని, అయితే ఇప్పుడది నిజం కాదని తేలిపోయిందని మంజునాధ్ తెలిపారు.
మానసిక ఒత్తిడి, పొగతాగడం, మధుమేహం, స్థూలకాయం కూడా ముందుగా గుండె జబ్బులు రావడానికి కారణం కావచ్చని వైద్యులు వివరించారు. గుండె జబ్బుల గురించి మహిళలకు పెద్దగా అవగాహన లేదని 83 శాతం మంది వైద్యులు అభిప్రాయపడ్డారు. అయితే అవగాహనా లోపంతో ఆలస్యంగా ఆసుపత్రుల్లో చేరడం వల్ల ఎక్కువ మంది అకాలమరణం చెందుతున్నారని 76 శాతం మంది వైద్యులు అభిప్రాయపడ్డారు. గుండె జబ్బులను గుర్తించడంలో గృహిణుల కంటే ఉద్యోగినులే ముందున్నారు.