: ఎవరీ స్టఖోవ్ స్కీ..?


సెర్గీ స్టఖోవ్ స్కీ.. నిన్నటి వరకు ఎవరికీ తెలియని పేరు. టెన్నిస్ వర్గాల్లో అతనో అనామకుడు. కానీ, నేడు ఓ సంచలనం. దిగ్గజ క్రీడాకారుడు ఫెదరర్ మోముపై చిరునవ్వును మటుమాయం చేసిన ఈ ఉక్రెయిన్ జాతీయుడు ఇప్పుడు వింబుల్డన్ లో హాట్ టాపిక్. ఏడుసార్లు వింబుల్డన్ గెలిచి ఎనిమిదోసారి కూడా నెగ్గి ఆల్ టైమ్ రికార్డు సాధిద్దామనుకున్న స్విస్ స్టార్ ఫెదరర్ ఆశలపై నీళ్ళు చల్లిన స్టఖోవ్ స్కీ.. ఉక్రెయిన్ లోని కీవ్ నగరానికి చెందినవాడు. 2003లో పూర్తిస్థాయి టెన్నిస్ క్రీడాకారుడిగా అవతారమెత్తాడు.

జూనియర్ లెవల్లో బ్రిటన్ ఆశాకిరణం ఆండీ ముర్రే, వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జోకోవిచ్ లతో తలపడిన ఈ ఉక్రెయిన్ జాతీయుడు.. 2004లో యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరాడు. అదే అతని కెరీర్లో ఇప్పటివరకు అతిపెద్ద మైలురాయి. ఆ మ్యాచ్ లో ముర్రే చేతిలో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. ఇక జోకోవిచ్ నైతే లక్జెంబర్గ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో చిత్తు చేసి తాను జెయింట్ కిల్లర్ నని చాటుకున్నాడు. వింబుల్డన్ లో రారాజు అనదగ్గ ఫెదరర్ ను క్వార్టర్ ఫైనల్ దశ ముందే ఇంటిదారి పట్టించిన క్రీడాకారుడు స్టఖోవ్ స్కీనే.

ఈ పచ్చిక కోర్టులో ఫెదరర్ గెలుపోటముల రికార్డు 67-7గా ఉండగా.. 116వ ర్యాంకర్ స్టఖోవ్ స్కీ గణాంకాలు 2-4గా ఉన్నాయి. స్పెయిన్ బుల్ నడాల్ తొలి రౌండ్లోనే షాక్ కు గురై నిష్క్రమించిన నేపథ్యంలో ఫెదరర్ హవాకు అడ్డేలేదని అందరూ భావించగా.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన స్టఖోవ్ స్కీ అనామకుడెలా అవుతాడు?.. అన్నీ అనుకూలిస్తే.. వింబుల్డన్ లో టైటిల్ గెలుస్తాడేమో!

  • Loading...

More Telugu News