: ఈ కారు సూపర్ ఫాస్ట్!
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే కారు త్వరలో మన ముందుకు రానుంది. ఎంత వేగమంటే ఒక గంటకు సుమారు 328.6 కిలోమీటర్లు. అయితే దీనికి చాలా ఎక్కువే పెట్రోలో లేదా డీజలో వాడాలేమో అనుకుంటున్నారా... అదేం కాదు, ఇది కరెంటుతో నడిచే కారు. అయినా రోడ్లమీద నడిపించేది కాదులెండి. ఇది ఒక రేస్ కారు. పందేనికి వాడే ఈ కారు గతంలో వేగం విషయంలో ఉన్న బ్యాటరీబాక్స్ జనరల్ ఎలక్ట్రిక్ అనే కారు రికార్డును బద్దలు కొట్టింది.
1974లో బ్యాటరీ బాక్స్ జనరల్ ఎలక్ట్రిక్ అనే కారు గంటకు 281.6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. ఈ కారును లోలా బీ12 69/ఈవీ అనే పేరుతో డ్రేసన్ రేసింగ్ టెక్నాలజీ సంస్థ నిర్మించింది. ఈ కారు నిర్మించిన 39 ఏళ్లకు మళ్లీ డ్రేసన్ సంస్థ ఇప్పుడు ఈ కొత్త కారును రూపొందించింది. ఈ కొత్త కారు గురించి సంస్థ నిర్వాహకుడు లార్డ్ డ్రేసన్ చెబుతూ విద్యుత్తు కారు భవిష్యత్తు ఏమిటో అనేది ప్రపంచానికి చాటడమే తమ ఉద్దేశ్యమని చెబుతున్నారు.