: ఇలా తింటేనే బలమైన బిడ్డ పుడుతుంది
గర్భంతో ఉన్న తల్లులు బలమైన ఆహారం తీసుకుంటే వారికి పుట్టే బిడ్డ కూడా బలంగా, ఆరోగ్యంగా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. గర్భవతులు తమ ఆహారంలో ఎక్కువగా ఆకుపచ్చని కూరగాయలు, పప్పు దినుసులూ, బీన్స్, గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం పప్పు, డార్క్ చాక్లెట్లు వంటివి ఉండేలా చూసుకోవాలని, అప్పుడు వారికి పుట్టే బిడ్డలు బాగా ఆరోగ్యంగా పుడతారని బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
గర్భంతో ఉన్న మహిళలు సరైన ఆహారం తీసుకోకుంటే వారికి పుట్టే బిడ్డలు బలహీనంగా, తక్కువ బరువుతో పుట్టడమే కాకుండా పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. తల్లులు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల పిల్లల్లో తగినంత ఇనుము లభించక వారిలో రక్తహీనత వంటి సమస్యలు ఎదురవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. దీని అంచనాల ప్రకారం గర్భవతులు రోజూ కనీసం 60 మిల్లీగ్రాములు ఇనుమును తీసుకోవాల్సి ఉంది. ఇంతకన్నా తక్కువ ఇనుము తీసుకుంటే పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుట్టడమే కాకుండా నీరసంగా ఉంటారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం మ్మీద సుమారు మూడు కోట్ల ఇరవై లక్షలమంది గర్భిణులు ఐరన్ లోపంతో బాధపడుతున్నారట. ఈ విషయంపై ఇప్పటి వరకూ జరిగిన సుమారు తొంభై అధ్యయనాల్ని పరిశీలించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చి చెబుతున్నారు.