: ఉత్తరాఖండ్ లెక్కలు 'మిస్' అవుతున్నాయి!
వరద నష్టం వివరాలను డెహ్రాడూన్ విపత్తు నిర్వహణశాఖ ఇవాళ ఓ ప్రకటనలో విడుదల చేసింది. వరదల్లో చిక్కుకుని 560 మంది మరణించగా, 334 మంది గల్లంతయ్యారన్న అధికారులు, మరో 436 మంది గాయపడ్డారని ప్రకటించారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 99 వేల మంది యాత్రీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఇంకా పలు చోట్ల 4 వేల మంది చిక్కుకున్నారని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది.
తాజా వరదల వల్ల 154 వంతెనలు, 2,232 ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. 1520 కి పైగా రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. కేంద్ర విపత్తుల శాఖ అధికారులు ఇలా చెబుతుండగా రాష్ట్రాల లెక్కలు ఇంకోలా ఉన్నాయి. తమ రాష్ట్రానికి చెందిన స్థానికుల సంఖ్య కచ్చితంగా తేలకపోయినా, వెయ్యిమందికి పైగా స్ధానికులు మరణించి ఉంటారని ఉత్తరాఖండ్ చెప్తుండగా, మరోపక్క తమ రాష్ట్రానికి చెందిన యాత్రీకులు వందమందికి పైగా గల్లంతయ్యారని గుజరాత్ చెబుతోంది. ఇంకోపక్క కేవలం ఆంధ్రా యాత్రీకులే 430 మంది గల్లంతయ్యారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మరి ఈ లెక్కన గల్లంతైన వారు మొత్తం ఎందరు? విపత్తు నిర్వహణ శాఖ చెబుతున్న లెక్కన 334 మందే గల్లంతయినట్టు. మరి, ఈ తేడా ఎక్కడ వస్తోంది? ఈ పొంతన లేని లెక్కలు ఏమిటి? ఇవన్నీ ప్రజలను గందరగోళానికి గురి చేయడానికా?