: ఏంజెలీనా - 8మంది పిల్లల తల్లి
ఏంజెలీనా జోలీ ఎనిమిది మంది పిల్లల తల్లి అవుతుందా? ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారున్నారా..? అది కూడా సెలబ్రిటీల్లో.. అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టే.. అందగత్తెల్లో ఒకరుగా పేరున్న హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ ఇప్పటికే ఆరుగురు పిల్లల తల్లి. ఇందులో ముగ్గురు ఆమె కన్న బిడ్డలు కాగా, ముగ్గురిని దత్తత తీసుకుంది.
తాజాగా సిరియా కాందిశీకులను కలిసి వారి కన్నీరు తుడిచే ప్రయత్నం చేయబోతున్న ఏంజెలీనా.. వారినుంచి ఓ చిన్నారిని దత్తత తీసుకోదలచుకున్నట్లు తెలుస్తోంది. తాను దత్తత తీసుకుంటే ఆ విషయానికి వచ్చే పబ్లిసిటీ సిరియన్ల దుస్థితి గురించి యావత్ ప్రపంచానికి తెలిసేలా చేస్తుందని ఆమె ఆశిస్తోంది. ఈ దత్తత బిడ్డ కాకుండా.. మరొక బిడ్డను కనాలని కూడా జోలీ, బ్రాడ్ పిట్ దంపతులు అనుకున్నారట. ఇప్పటికే ముగ్గురిని కన్న వీరు త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం నాలుగో బిడ్డను కనే ప్రయత్నాల్లో ఉన్నారట.