: దొంగని పట్టించిన సెల్ వాల్ పేపర్
ఎంత తెలివైన దొంగైనా చిన్న తప్పు చేస్తాడు. అది చాలు అతను పోలీసులకు పట్టుబడటానికి.. సరిగ్గా ముంబైలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఓ దొంగకు..
అది ముంబయిలోని మలాడ్ ప్రాంతం.. అక్కడి జకారా రోడ్డులో ఉంది బంగారు నగల దుకాణం శంకర్ లాల్ అండ్ కంపెనీ..రోజులాగే యజమాని పంకజ్ జైన్ దుకాణం తెరిచారు. రాత్రి దుకాణంలో దొంగలు పడి వెండి వస్తువులు దొంగిలించినట్లు గమనించిన పంకజ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన పోలీసులు దుకాణంలోని సీసీటీవీ వీడియోని పరిశీలించారు. వీడియోలో దొంగ సెల్ ఫోన్ టార్చ్ సహయంతో షాపంతా వెతికాడు. సేఫ్ ని తెరవడానికి ప్రయత్నించాడు. అయితే అలారం మోగడంతో చేతికి చిక్కిన వెండి వస్తువులతో పరారయ్యాడు.
బంగారు దుకాణంలోని సీసీకెమెరా సహయంతో దొంగ సెల్ ఫోను వాల్ పేపర్ ఒక్కదాన్నే పోలీసులు సరిగా గుర్తించగలిగారు. జాగ్రత్తగా పరిశీలించగా.. షాపు వెనుక వైపు నుంచి దగ్గరలో నిర్మాణంలో ఉన్న భవంతికి సొరంగం తవ్వి ఉంది. అక్కడ పనిచేస్తున్న కూలీలపై అనుమానంతో పరిశీలించగా.. వారిలో ఒకడైన సల్మాన్ షేక్ సెల్ వాల్ పేపర్ ..సీసీ టీవీ రికార్డు చేసిన వాల్ పేపర్ తో పోలింది. ఇంకేముంది దొంగ దొరికిపోయాడు. పోలీసులు తమ పద్ధతిలో దొంగను విచారించడంతో..తన ఇంట్లో వస్తువులని దాచిన విషయాన్ని సల్మాన్ ఒప్పేసుకున్నాడు.