: 20 వేల మందిని కాపాడిన సైన్యానికి సలాం
చార్ ధామ్ యాత్రలకు వెళ్లి బారీ వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు భారత సైన్యం పగలనక రాత్రనక శ్రమపడుతూనే ఉంది. అయితే, మళ్లీ వర్షం కురుస్తుండడంతో వారి సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది కానీ ఆర్మీజవాన్లు కాలినడకన కొండలు, గుట్టలు ఎక్కుతూ బాధితులను రక్షిస్తున్నారు. వారంరోజులుగా తిండి, త్రాగునీరు లేక యాత్రీకులు పూర్తిగా క్షీణించిపోయారు. అలాంటి వారిని భుజాన వేసుకుని జవాన్లు కొండల క్రిందకి తరలిస్తున్నారు. గత వారం రోజులుగా సహాయక చర్యలు చేపట్టిన ఆర్మీ, ఇప్పటి వరకూ 20,000 మందిని కాపాడిందని ఆర్మీ అధికార ప్రతినిధి వీరేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు. అయితే పర్వతాల్లో మరింత మంది చిక్కుకుపోయారని, వారిని కూడా రక్షించేందుకు సైన్యం తీవ్రంగా కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఆర్మీ సహాయసహకారాలతో బ్రతికి బయటపడ్డవారంతా సైన్యం సేవలకు సలాం చేస్తున్నారు.