: ఆన్ లైన్ వార్తల పట్ల మక్కువ
ఆన్ లైన్లో వార్తలకు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరిగిపోతోంది. ఇంటర్నెట్ మారుమూల ప్రాంతాలకూ చేరిపోతున్న రోజులు కావడంతో ఆన్ లైన్ వీక్షకులు ఏటేటా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కళ్ల ముందే కంప్యూటర్, అరచేతిలో స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ పీసీలు అన్నింటా వెబ్ విహారం. దీంతో ఆన్ లైన్లో వెబ్ సైట్లను తెరచి వార్తలు చూసేవారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఆన్ లైన్లో వార్తలు చదవడానికి యూజర్లు డబ్బులు చెల్లించడానికి కూడా సుముఖంగా ఉన్నారని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది.
యూనివర్సిటీకి చెందిన రాయిటర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్, స్పెయిన్, ఇటలీ, బ్రెజిల్, జపాన్ దేశాల్లో 11వేల మంది ఇంటర్నెట్ వినియోగదారులపై అధ్యయనం నిర్వహించింది. వీరిలో అధికశాతం మంది ఆన్ లైన్ వార్తల పట్ల మక్కువ చూపారు. డబ్బులు చెల్లించడానికీ సిద్ధమేనని తెలిపారు. మనదేశంలోనూ ఆన్ లైన్ వార్తల పట్ల ఆదరణ పెరిగిపోతున్న తీరును చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ప్రాంతీయ భాషలు కూడా ఇంటర్నెట్ లోకి ప్రవేశించిన తర్వాత ఈ ధోరణి పెరిగిపోయింది.