: పక్కింటివాళ్లే పాడుమనుషులు
మనకు పక్కింటివారే మనపాలిట దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారట. మన రాష్ట్రంలో గత ఏడాది జరిగిన అత్యాచారానికి సంబంధించిన కేసుల వివరాలను పరిశీలిస్తే పక్కింట్లో ఉన్న వ్యక్తులే దుర్మార్గాలకు పూనుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2012 డేటాను పరిశీలిస్తే కూడా ఇదే విషయాలు స్పష్టమవుతున్నాయి. ఈ నివేదికను పరిశీలిస్తే రాష్ట్రంలో గత ఏడాది జరిగిన అత్యాచారాల్లో సుమారు 1341 మంది బాధితులు వారి సమీప బంధువులు, తెలిసిన వారి అఘాయిత్యాలకు బలైనవారేనని తేలింది.
ఇందులో రాష్ట్ర రాజధానికి చెందిన బాలికలు, మహిళల సంఖ్య 74కాగా , 521 నేరాల్లో పొరుగింటివారు, 811 నేరాల్లో పరిచయస్తులు, బంధువులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు తేలింది. అఘాయిత్యాలకు గురైన మహిళలు ఈ విషయాన్ని బయటపెడితే ఎక్కడ తమ పరువు పోతుందోనన్న భయానికి గురవుతున్నారని, మౌనంగా బాధను అనుభవిస్తున్నట్టు ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన పరిశోధనలో తేలింది. మహిళలనే కాకుండా పసివయసున్న బాలికలను సైతం కామాంధులు కాటేస్తున్నారు. ఈ విషయంలో దేశంలో మొదటిస్థానంలో మధ్యప్రదేశ్ ఉండగా తర్వాత రెండు స్థానాల్లోను ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. మన రాష్ట్రం ఈ విషయంలో నాలుగోస్థానంలో ఉందట.